1998 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు తమ విద్యాసంస్థ ‘ఐఐటీ- బాంబే’కు రూ.57 కోట్ల విరాళం అందజేశారు.

తాము చదువుకున్న విద్యాసంస్థకు విరాళాలు అందజేసే విషయంలో ఐఐటీ- బాంబే (IIT Bombay) పూర్వ విద్యార్థులు మరోసారి ఆదర్శంగా నిలిచారు. 1998 పాసవుట్‌ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ‘ఐఐటీ- బాంబే’కు రూ.57 కోట్ల విరాళం అందజేశారు. తమ సిల్వర్‌ జూబ్లీ రీయూనియన్‌ సందర్భంగా ఈ సాయానికి ముందుకొచ్చారు. ఒకే బ్యాచ్‌కు సంబంధించి ఇదే అత్యధిక విరాళం కావడం విశేషం. గతంలో 1971 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు తమ గోల్డెన్‌ జూబ్లీ సంబరాల సందర్భంగా రూ.41 కోట్లు అందజేశారు.

సిల్వర్‌ లేక్‌ ఎండీ అపూర్వ్‌ సక్సేనా, పీక్‌ XV ఎండీ శైలేంద్ర సింగ్‌, వెక్టార్‌ క్యాపిటల్‌ ఎండీ అనుపమ్‌ బెనర్జీ, గూగుల్‌ డీప్‌మైండ్‌కు చెందిన దిలీప్‌ జార్జ్‌ తదితర 200 మందికిపైగా పూర్వ విద్యార్థులు ఇందులో భాగమయ్యారు. ఐఐటీలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు, పరిశోధనలకు ఈ విరాళం సాయపడుతుందని ‘ఐఐటీ బాంబే’ డైరెక్టర్ సుభాశీష్‌ చౌధురి తెలిపారు. 2030 నాటికి ప్రపంచంలోని అగ్రశ్రేణి 50 విశ్వవిద్యాలయాల్లో ‘ఐఐటీ బాంబే’ను నిలపాలనే లక్ష్యానికి పూర్వ విద్యార్థుల చొరవ దోహదపడుతుందన్నారు.

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు నందన్‌ నీలేకని, ఇతర పూర్వ విద్యార్థుల స్ఫూర్తితో ఈ విరాళానికి ముందుకొచ్చినట్లు 1998 బ్యాచ్‌కు చెందినవారు తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో ‘ఐఐటీ బాంబే’ను ప్రపంచ ప్రధాన విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా నిలిపేందుకు, ఇతర పూర్వ విద్యార్థులను కూడా దాతృత్వ సహకారం దిశగా మళ్లించేందుకు తమ ప్రయత్నం సాయపడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. నందన్‌ నీలేకని గతంలో రెండు సందర్భాల్లో ‘ఐఐటీ బాంబే’కు రూ.315 కోట్లు, రూ.85 కోట్ల చొప్పున విరాళాలు అందజేసిన విషయం తెలిసిందే.

Abdul Nayeem
Author: Abdul Nayeem

Sub editor

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here