భద్రాచలం.14.03.2024 : భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు చెల్లించవలసిన ఏడు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ హాస్పిటల్ కాంట్రాక్ట్ శానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్ కేర్ ల్యాబ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో కార్మికులు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించి సూపరిండెండెంట్ డాక్టర్ రామకృష్ణకు వినతిపత్రం అందించారు.

రెండు రోజుల్లో వేతనాలు చెల్లించడానికి ప్రయత్నిస్తామని డాక్టర్ రామకృష్ణ తెలిపారు.ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఎం బి నర్సారెడ్డి, గడ్డం స్వామి లు మాట్లాడుతూ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో శానిటేషన్ వర్కర్స్, సెక్యూరిటీ గార్డ్స్, ల్యాబ్ విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు గత ఏడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే ప్రభుత్వం కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

రెండు రోజుల్లో బకాయి వేతనాలు చెల్లించకుంటే ఈ నెల 17 నుండి అన్ని రకాల పనులు నిలిపివేసి నిరవధిక సమ్మె నిర్వహిస్తామని అన్నారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒకటవ తేదీనే జీతాలు చెల్లిస్తామని చెబుతోందని కానీ కాంట్రాక్ట్ కార్మికులకు ఏడు నెలలుగా జీతాలు రాకపోతే ఎందుకు జీతాలు చెల్లించడం లేదని ప్రశ్నించారు. వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని చెబుతున్న ప్రభుత్వం ఏరియా హాస్పిటల్ లో పనిచేస్తున్న కార్మికుల జీతాల విషయంలో ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదని అన్నారు.

కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారం రూ: 21000/- చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యంతో పాటు ఇన్సూరెన్స్ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ వర్కర్స్ రమా, కృష్ణ, కుమారి, రమణ, మమత, వరలక్ష్మి, పెద్ద రమణ, సెక్యూరిటీ గార్డ్స్ నాగరాజు, నరేంద్ర పేషంట్ కేర్ సుల్తాన్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here