హైదరాబాద్.08.05.2024 : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్, భారాస అభ్యర్థులు ప్రజలకు తెలియదని.. వాళ్లకు డిపాజిట్లు దక్కే అవకాశం లేదని మల్కాజిగిరి భాజపా ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్‌ ద ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏ సర్వే సంస్థకూ అందని ఫలితాలు మల్కాజిగిరిలో వస్తాయని తెలిపారు. మైనారిటీలు కూడా భాజపాకు ఓటు వేస్తామని చెబుతున్నారన్నారు. తన ఇరవై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పుడున్న కలుషిత రాజకీయాలను చూడలేదని వ్యాఖ్యానించారు.

‘‘ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్పితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. కాళేశ్వరం అవినీతిపరులపై చర్యలు తీసుకోకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తోంది. ఈ ప్రభుత్వంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది. ఎన్నికల్లో ఓట్లు పడవని తెలిసి ఇప్పుడు రైతు భరోసా నిధులు విడుదల చేశారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయి. హస్తం పార్టీకి ఓటు వేస్తే కేంద్రంలో ఒరిగేది ఏమీ లేదు. రేవంత్ రెడ్డి వీడియో, ఆడియోలు మార్ఫింగ్ చేసి కేసీఆర్‌ను మించిపోయారు. నాలుగు నెలల్లోనే ఆయన అబద్ధాలకోరని అర్థమైంది. బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించింది ప్రధాని మోదీ. భాజపా రిజర్వేషన్లు తొలగిస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇండియా కూటమిలో ఎవరు ప్రధాని అవుతారనే అంశంపై స్పష్టత లేదు. సంకీర్ణ రాజకీయాలకు కాలం చెల్లింది.. రాహుల్ గాంధీ ప్రధాని కాలేరు’’ అని ఈటల రాజేందర్‌ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here