మాచర్ల.13.05.2024 : పోలింగ్‌ ప్రక్రియకు వైకాపా కార్యకర్తలు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో సిబ్బంది పోలింగ్‌ నిలిపివేసి.. భయంతో బయటకు వెళ్లిపోయారు. మరోవైపు అదే నియోజవర్గంలోని తుమ్మరకోటలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో అక్కడ పోలింగ్‌ నిలిచిపోయింది. ఐజీ శ్రీకాంత్‌, ఎస్పీ బిందుమాధవ్‌ ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రెంటాలలో తెదేపా అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి వాహనంపై వైకాపా మూకలు రాళ్ల దాడి చేశారు. పోలింగ్‌ సరళిని చూసేందుకు వెళ్లిన ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బంది కళ్లలో వైకాపా మూకలు కారం కొట్టారు.

తలుపులేసుకున్న పోలీసులు :

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని ఓంశాంతి నగర్‌లో వైకాపా, తెదేపా వర్గీయులు రాళ్లదాడికి దిగారు. దీంతో భయపడిన పోలీసులు ఇళ్లలోకి దూరి తలుపులు వేసుకున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం నందిపాలెం పోలింగ్‌ బూత్‌ వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. 211వ పోలింగ్‌ కేంద్రం వద్ద వైకాపా కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. తెదేపా అభ్యర్థి నారాయణరెడ్డి కుమారుడు విఘ్నేశ్‌రెడ్డి వాహనంపై రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా హుస్సేన్‌పురం పోలింగ్‌ బూత్‌ వైకాపా ఎంపీపీ పురుషోత్తంరెడ్డి వర్గీయులు, తెదేపా నాయకులపై దౌర్జన్యానికి దిగారు. వారిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. వారిని వైకాపా నాయకులు కిందపడేసి కొట్టారు. ఈ ఘటనలో తెదేపా నాయకుడు గాయపడ్డారు. రిగ్గింగ్‌ చేయాలనే ఉద్దేశంతోనే తమపై దాడి చేశారని తెదేపా నాయకులు మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here