డిల్లీ.17.02.2024: తమ డిమాండ్ల సాధన కోసం పంజాబ్‌, హర్యానా రైతులు ఢిల్లీ ఛలో కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, రైతుల ర్యాలీ, నిరసనల నేపథ్యంలో ఉద్రిక్తకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

తాజాగా శంభు సరిహద్దు ప్రాంతం రణరంగంగా మారింది. మరోవైపు.. నిరసనల్లో పాల్గొన్న ఓ రైతు గుండెపోటుతో మృతిచెందాడు.

వివరాల ప్రకారం.. రైతులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తకరంగా మారుతున్నాయి. శంభు సరిహద్దు తదితర చోట్ల తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. ఢిల్లీవైపుగా వెళ్లేందుకు రైతులు ప్రయత్నించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

రైతుల నిరసనల్లో భాగంగా కొందరు వ్యక్తులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో, వారిని తరిమికొట్టేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు.

ఇక, శంభు సరిహద్దు వద్ద నాలుగు రోజులుగా ఆందోళనల్లో పాల్గొంటున్న జ్ఞాన్‌సింగ్‌ అనే 63 ఏళ్ల రైతు గుండెపోటుతో మృతిచెందాడు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లాకు చెందిన ఆయనకు ఉదయం గుండె నొప్పి రావడంలో ఆసుపత్రిలో చేర్చినా లాభం లేకపోయింది. మరోవైపు.. పంజాబ్‌, హర్యానా రైతులకు మద్దతు తెలుపుతూ త్రిపురలో రైతులు, సీఐటీయూ వర్గాలు ర్యాలీలు చేపట్టాయి.

రైతుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరు పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా.. నాలుగు రోజులుగా కొనసాగుతున్న రైతుల ఉద్యమాన్ని సోషల్‌ మీడియాలో ప్రసారం చేస్తున్న 70 యూట్యూబ్‌ చానళ్లపై కేంద్రం నిషేధం విధించింది.

ఆందోళనకారులు రాళ్లు రువ్వుతూ భద్రతా దళాలను కవ్విస్తున్నారంటూ పోలీసులు వీడియోలను విడుదల చేశారు.

Rajesh
Author: Rajesh

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here