హైదరాబాద్: మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నందున మాస్క్ మస్ట్ నిబంధన అమల్లోకి తేవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది. ఇప్పటికే దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 6వేలు దాటిపోయింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,420కి చేరింది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్ 1 విజృంభిస్తుండటంతో హర్యానా, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలు ఇప్పటికే మాస్క్ తప్పని సరి అనే నిబంధనను అమల్లోకి తెచ్చాయి. గడిచిన 24 గంటల్లో కేరళలో ఇద్దరు, రాజస్థాన్, కర్నాటకల్లో ఒక్కొక్కరు కరోనా బారిన పడి చనిపోయారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

ప్రస్తుతం తెలంగాణలో 9 యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో 9 కేసులు యాక్టివ్ ఉన్నాయి. కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసింది. సర్కారు దవాఖానల్లో బెడ్లను సిద్ధం చేసింది. ఆక్సిజన్ యూనిట్లను రెడీ చేసింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. రద్దీ ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరి అనే నిబంధనను అమల్లోకి తేనుందని సమాచారం.

త్వరలో జరిగే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను సామూహికంగా జరుపుకొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గ్రూప్ గ్యాదరింగ్ ఉండే ప్రాంతాల్లో తొలి విడతలో మాస్క్ తప్పనిసరి అనే నిబంధనను అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కరోనా జేఎన్ వేరియంట్ విజృంభిస్తుండటం.. రాష్ట్రంలోనూ కేసులు నమోదవుతుండటంతో పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు ఇప్పటికే గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు అవసరమైతేనే బయటికి వెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ సూచించింది.

ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భారీ క్యూ లైన్లు వెలిశాయి. ఉత్తర ద్వార దర్శనానికి పిల్లలు, వృద్ధులు ఆలయాలకు తరలివచ్చారు. పైగా ఎలాంటి ప్రీకాషన్స్ పాటించలేదు. కనీసం మాస్కులు కూడా ధరించలేదు. కిక్కిరిసిన క్యూలైన్లలో నిబడి వైకుంఠద్వార దర్శనం చేస్తుకున్నారు.

త్వరలోనే క్రిస్మస్, న్యూఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నందున మరింత వైరస్ వ్యాపిస్తే పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మాస్కులు తప్పనిసరి అనే నిబంధనను అమల్లోకి తేవాలని యోచిస్తున్నట్టు సమాచారం. అలాగే కొద్ది రోజుల వరకు గ్రూప్ గ్యాదరింగ్స్ పైనా ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే సర్కారు క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

Abdul Nayeem
Author: Abdul Nayeem

Sub editor

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here