హైదారాబాద్.01.05.2024 : రేవంత్ ఫేక్ లతో తన వ్యవహారశైలితో సీఎం పదవిని రేవంత్‌రెడ్డి దిగజారుస్తున్నాడని, బీఆర్‌ఎస్‌ నుంచి రంజిత్‌రెడ్డి, సునీతమహేందర్‌రెడ్డి, కడియం కావ్య, శ్రీహరి, దానం నాగేందర్‌ను తీసుకున్న రేవంత్‌రెడ్డికి మాట్లాడే నైతికత లేదని విమర్శించారు.

మంగళవారం సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌, రాయపోల్‌, దౌల్తాబాద్‌ మండల కేంద్రాల్లో నిర్వహించిన రోడ్‌షోల్లో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తిట్లు తిట్టుడు, లేకుంటే దేవుని మీద ఓట్లు పెడుతూ డ్రామాలు అడుతున్నదని రేవంత్‌ కాదా అని ప్రశ్నించారు.

ఆరు గ్యారెంటీల ఆశ చూపి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడగొట్టి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌పై కోపంతో బీజేపీకి ఓటేసి ఆగం కావొద్దని ప్రజలకు హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. ఇంటి పార్టీ బీఆర్‌ఎస్‌ను గెలిపించుకుంటేనే తెలంగాణ ప్రయోజనాలు పరిరక్షిస్తారని, ప్రజల పక్షాన గళం విప్పే అవకాశం ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే కల్యాణలక్ష్మి చెక్కులు అటకెక్కాయని, తులం బంగారం కొండెక్కిందని ఎద్దేవా చేశారు.

విభజన హామీలు పట్టని బీజేపీ

జూన్‌ 2నాటికి తెలంగాణ ఏర్పాటై పదేండ్లు అవుతుందని, నేటికీ విభజన హామీలు నెరవేర్చలేదని తన్నీరు హరీశ్‌రావు అన్నారు. వాటిపై పార్లమెంట్‌లో పోరాడాలంటే బీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలవాలని అన్నారు. ప్రజల కోసం కొత్త జిల్లాలను కేసీఆర్‌ ఏర్పాటు చేస్తే అవి తీసేస్తామంటున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని దించేయాలని పిలుపునిచ్చారు. బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడంతోనే కవితను జైల్లో పెట్టారని మండిపడ్డారు. ఫేక్‌ వీడియోలు, గ్లోబెల్స్‌ ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈనెల 13న మీరు వేసే ఓటుతో గుంపు మేస్త్రీ గువ్వ పగలాలని, ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని మరోసారి మాజీ మంత్రి హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. ప్రచారంలో బీఆర్‌ఎస్‌ మెదక్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, నాయకులు రాధాకృష్ణశర్మ, కేశిరెడ్డి నర్సింహ్మరెడ్డి, మాదాసు శ్రీనివాస్‌, దేవీ రవీందర్‌, మర్కూక్‌ కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here