హైదరాబాద్‌.12.05.2024 : జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. వర్షం కారణంగా తలెత్తిన ఇబ్బందులపై టోల్‌ ఫ్రీ నంబర్లు 040 2111 1111, 90001 13667కు సమాచారం అందించాలని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం, నల్గొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

పలు జిల్లాల్లో వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి

తెలంగాణలోని పలు జిల్లాలో ఆదివారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం గిమ్మ గ్రామంలో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి.

సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లోనూ గాలివాన బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులకు ధాన్యం రాశులపై కప్పిన టర్ఫాలిన్‌ కవర్లు ఎగిరిపోవడంతో ధాన్యం తడిచిపోయింది.

పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లిలో పిడుగుపాటుకు తండ్రీకుమారుడు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద మండలం ముక్తాపూర్‌లో 5.1 సెం.మీ, మొగుడంపల్లిలో 2.6, మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం లింగాయిపల్లిలో 1.9 సెం.మీ వర్షపాతం నమోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here