భువనేశ్వర్.17.02.2024: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా వంటి ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల సవరణతో పాటు కొత్త ఓటర్ల నమోదు వంటి కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఒడిశాలో పర్యటిస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇవాళ కీలక ప్రకటన చేశారు.

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల నిర్వహణకు పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ ఇవాళ భువనేశ్వర్ లో ప్రకటించారు. ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో అక్కడ ఎన్నికల ఏర్పాట్లను ఆయన ఈసీ బృందంతో కలిసి పరీశీలించారు.

అనంతరం అధికారులతో భేటీ అయ్యారు. ఎన్నికల సందర్భంగా చేపట్టాల్సిన చర్యల్ని వారికి సూచించారు. అనంతరం ఒడిశాలోనూ ఎన్నికలకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు.

ఇప్పటికే ఏపీతో పాటు ఎన్నికలు పెండింగ్ లో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్య ఎన్నికల అధికారులు తమ సన్నద్ధతను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెల చివరి వారంలో లేదా మార్చి మొదటివారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఈసీ సిద్ధమవుతోంది.

ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఏ క్షణాన అయినా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు వెల్లడించాయి. దీంతో ఉత్కంఠ మరింత పెరుగుతోంది.

Rajesh
Author: Rajesh

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here