భద్రాచలం.13.03.2024 : రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రాచలం వస్తున్న నేపథ్యంలో భద్రాచలం పట్టణాభివృద్ధి, సమస్యలపై నిర్దిష్టమైన ప్రకటన చేస్తారని కోటి ఆశలతో ఎదురుచూసిన ప్రజలకు నిరాశ మిగిలిందని అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పేర్కొన్నాయి.

సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష పార్టీల ప్రెస్ మీట్ లో అఖిల పక్షం తరుపున సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు ముందుగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రాముని సన్నిధిలో ప్రకటించడం శుభ పరిణామం అన్నారు.

భద్రాచలం నియోజకవర్గం సమస్యలతో పాటు భద్రాచలం పట్టణంలో ఉన్న ప్రధాన సమస్యలు కరకట్ట, ఐదు గ్రామ పంచాయతీలు, శ్రీరాముడి ఆలయం అభివృద్ధి, ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను భర్తీ చేయడం తదితర ప్రధాన అంశాలపై నిర్దిష్టంగా ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం పట్ల ప్రజలలో నిరాశ మిగిలిందని అన్నారు. ముఖ్యంగా భద్రాచలం పట్టణంలో వరదల సందర్భంగా ముంపుకు  గురైన ప్రజలు మానసిక ఇబ్బందులకు గురి అయ్యారని అన్నారు.

పోలవరం బ్యాక్ వాటర్ వలన నిర్వాసితులుగా మారే ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న కరకట్టను బలోపేతం చేయాలని అన్నారు. కరకట్టకు ఇరువైపులా చెట్లు పెరిగి  నెర్రలు బారాయని, కరకట్ట బలోపేతం చేసి నెర్రలు సరిచేసి, రిపేర్లు చేయాలని అలాగే కరకట్టకు ఆరు స్లూయిజ్ లకు మరమ్మతులు చేసి అధునాతన మోటర్లు ఏర్పాటు చేయటం ద్వారా పట్టణంలోకి నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న ఐదు గ్రామపంచాయతీలను తెలంగాణాలో కలపడం కోసం అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి, కేంద్ర బిజెపి ద్వారా ఆర్డినెన్స్ తీసుకురావాలని, అందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. దక్షిణాయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రాముని ఆలయం అభివృద్ధికి, సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని కోరారు.

భద్రాచలం ఏరియా హాస్పిటల్ మూడు రాష్ట్రాలకు కేంద్రంగా ఉన్నందున హాస్పటల్ నిరంతరం రోగులతో కిట కిట లాడుతున్నందున డాక్టర్లు ఇతర సిబ్బంది లేని కారణంగా తీవ్ర ఇబ్బంది జరుగుతుందని తక్షణమే సిబ్బంది కొరతను తీర్చాలనికోరారు .

తదితర సమస్యల పరిష్కారం కోసం ఖర్చు అయ్యే నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇటువంటి సమస్యలపై నిర్దిష్ట ప్రకటనను శ్రీరామనవమి నాటికైనా చేయాలని అఖిలపక్షం తరుపున విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో సిపిఐ నాయకులు రావులపల్లి రవికుమార్, బి.ఆర్.ఎస్ నాయకులు అరికెల తిరుపతిరావు, తెలుగుదేశం నాయకులు కొడాలి శ్రీనివాసరావు, ప్రజా పందా మాస్ లైన్ నాయకులు కెచ్చెల కల్పన, మాల మహానాడు అధ్యక్షులు దాసరి శేఖర్ సిపిఎం, సిపిఐ నాయకులు యం బి నర్సారెడ్డి, శివాజీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here