ఇతర జిల్లాల నుంచి రావాల్సిన బ్యాలెట్లు ఆలస్యం

ఓటు వేయలేక టీచర్లు, ఉద్యోగుల తిప్పలు

ఎన్నికల విధులు బహిష్కరిస్తామన్న టీచర్లు

ఖమ్మంలో 30% మందికి అందలే

ఓటేయకుంటే.. కోర్టుకు పోతం

పలు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితితో చిక్కులు

పోస్టల్ బ్యాలెట్లుకు సంబంధించి గవర్నమెంట్ టీచర్లు, ఇతర ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లు సకాలంలో అందకపోవడంతో ఓటు హక్కు వినియోగించుకోగలమా? లేదా? అనే సందిగ్ధంలో ఉన్నారు. ఇతర జిల్లాల నుంచి రావాల్సిన పోస్టల్ బ్యాలెట్లు ఆలస్యం కావడం, ట్రైనింగ్ తీసుకుంటున్న సెంటర్లలో బ్యాలెట్లు ఇవ్వకపోవడం, రిటర్నింగ్ ఆఫీసర్ల నుంచి సైతం సరైన సమాచారం అందకపోవడంతో గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్క ఖమ్మం జిల్లాలోనే పోస్టల్ బ్యాలెట్ కు అప్లయ్ చేసుకున్న వారిలో సుమారు 30% మందికి ఇంకా బ్యాలెట్ అందలేదని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉందని అంటున్నారు. పని చేస్తున్న చోటు, పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసుకున్న నియోజకవర్గం ఒకే జిల్లాలో ఉన్న వారి విషయంలో ఇబ్బంది లేదని.. రెండూ వేర్వేరు జిల్లాల్లో ఉన్న వారికి మాత్రం బ్యాలెట్ పై క్లారిటీ రావడం లేదని అంటున్నారు.

జిల్లాలో ఒకలా.. సెగ్మెంట్లలో ఒకలా చెప్తున్రు

ఖమ్మం టౌన్ కు చెందిన ఓ టీచర్ ఖమ్మం రూరల్ మండలంలో పనిచేస్తున్నారు. ఆమెకు సత్తుపల్లి నియోజకవర్గంలో ఎలక్షన్ డ్యూటీ పడింది. శనివారం వరకు పోస్టల్ బ్యాలెట్ రాకపోవడంతో తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లగా ఇంకా రెండ్రోజులు ఆగాలని సిబ్బంది నుంచి సమాధానం వచ్చిందన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ఒక ఆఫీసర్ మధిర నియోజకవర్గంలో వ్యవసాయ అధికారిగా పని చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్​కి అప్లై చేయగా ఆదివారం వరకు బ్యాలెట్ అందలేదు. రిటర్నింగ్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ లను కలిసినా క్లారిటీ రావడం లేదని, ఇంత వరకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించలేదని ఆయన తెలిపారు. అయితే, వివిధ కారణాల వల్ల పోస్టల్ బ్యాలెట్ అందని వాళ్లు కూడా ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ చెబుతున్నారని.. నియోజకవర్గాల్లో రిటర్నింగ్ ఆఫీసర్లను అడిగితే మాత్రం గడువు అయిపోయిందని, అక్కడికి వెళ్లండి, ఇక్కడికి వెళ్లండి అంటూ తిప్పించుకుంటున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. దాదాపుగా అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఈసారి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ప్రక్రియలో ఇబ్బందులకు గురవుతున్నారని తెలుస్తోంది.

గతంలో ఎమ్మార్వో ఆఫీస్ లోనే..

ఉద్యోగులు గతంలో పోస్టల్ బ్యాలెట్ కు అప్లై చేసుకుంటే, ఎమ్మార్వో ఆఫీస్ లో బాక్స్ ఉండేది. అక్కడే ఓటు హక్కు ఉపయోగించుకునేవారు. ఈసారి వృద్ధులకు, వికలాంగులతోపాటు ఇంకొంత మందికి కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించారు. కానీ సొంత నియోజకవర్గంలో రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరే ఓటేయాలని చెబుతుండడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు. ఎలక్షన్ డ్యూటీలో భాగంగా వేరే ప్రాంతాలకు వెళ్తున్న తమకు ఐదేండ్లు ఓసారి అయినా ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి రాకుండా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఓటేయకుంటే.. కోర్టుకు పోతం

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని శేరిగూడలో శ్రీహిందూ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన సెంటర్ లోనూ పోస్టల్ బ్యాలెట్లపై ఆదివారం ఇదే గందరగోళం నెలకొంది. వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి ఎన్నికల డ్యూటీపై వచ్చిన దాదాపు 200 మంది టీచర్లు తమకు ఇంకా బ్యాలెట్లు అందకపోవడంతో అధికారులను నిలదీశారు. వీరంతా 20 రోజుల కిందటే మొదటి ట్రెయినింగ్ సందర్భంగానే పోస్టల్ బ్యాలెట్​కు అప్లై చేసుకున్నారు. ఫారం 12 ద్వారా ఆర్డర్ కాపీ, ఎపిక్ కార్డు వంటి పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకున్నారు. కానీ అధికారుల సమన్వయలోపం కారణంగా ఇప్పటివరకూ పోస్టల్ బ్యాలెట్లు అందలేదు. టీచర్లు నిలదీయడంతో వివరాలు నమోదు చేసుకున్న అధికారులు అందరికీ బ్యాలెట్లు తెప్పిస్తామని హామీ ఇచ్చారు. 29న ఓటు వేయించాకే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు పంపుతామని చెప్పారు. దీంతో టీచర్లు వెనుదిరిగారు. ఒకవేళ 29వ తేదీలోగా పోస్టల్ బ్యాలెట్లు అందకపోతే ఎన్నికల విధులను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. తమను ఓటు హక్కుకు దూరం చేస్తే సంబంధిత ఎన్నికల అధికారులపై కోర్టును ఆశ్రయిస్తామని పలువురు టీచర్లు హెచ్చరించారు.

నా బ్యాలెట్ జగిత్యాలకు వెళ్లిందంటున్నరు…

‘నాది మధిర నియోజకవర్గం. నేను దుమ్ముగూడెం మండలంలో టీచర్ గా పని చేస్తున్నాను. పోస్టల్ బ్యాలెట్ కు అప్లై చేసుకుంటే, పొరపాటున జగిత్యాల జిల్లాకు వెళ్లిందని సిబ్బంది చెబుతున్నారు. ఒకరోజు మధిరకు, మరొక రోజు అశ్వారావుపేటకు వెళ్లాలని చెబితే రెండు చోట్లకూ తిరిగాను. కానీ ఇంత వరకు ఓటేయలేకపోయాను. నాలాగ మరికొందరు ఉద్యోగులు కూడా పోస్టల్ బ్యాలెట్ రాక ఇబ్బంది పడుతున్నారు’ అని ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తంచేశారు

Abdul Nayeem
Author: Abdul Nayeem

Sub editor

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here