postal ballot

తమ ఓటుపై శ్రద్ధ పెట్టని ఎన్నికల సిబ్బంది

చెల్లని వేల ఓట్లు.. పలుచోట్ల ఫలితాలపై ప్రభావం!

పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన ప్రతి ఓటరుతో ఓటు వేయించే సిబ్బంది.. తమ సొంత ఓటు వేయడంలో తడబడుతున్నారు. పోస్టల్‌ ఓటు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్న సిబ్బంది వేస్తున్న ఓట్లు పెద్దసంఖ్యలో చెల్లకుండా పోతున్నాయి. ఆ చెల్లని ఓట్లే చాలామంది అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తున్నాయి.

ఎందుకిలా?

ఎన్నికల విధులపై శిక్షణ ఇచ్చే సమయంలోనే సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగంపై అవగాహన కల్పిస్తారు. అయినా పొరపాట్లు, నిర్లిప్తత కారణంగా పలు ఓట్లు చెల్లకుండా పోతున్నాయి.

ఓటరు జాబితాలో ఉన్న ప్రకారం డిక్లరేషన్‌ పత్రంపై.. ఉద్యోగి పూర్తి పేరు, చిరునామా, బ్యాలెట్‌ పత్రంలో ఉన్న సీరియల్‌ నంబరు రాసి సంతకం చేయాలి. వాటిలో ఎక్కడైనా తప్పు దొర్లితే ఆ ఓటును పరిగణించరు.

డిక్లరేషన్‌ పత్రంపై గెజిటెడ్‌ అధికారి సంతకం చేయించాలి. పలువురు ఆ సంతకం లేకుండానే పోస్టల్‌ బ్యాలెట్‌లో ఓటు వేస్తున్నారు.

ఉద్యోగుల డిక్లరేషన్‌ పత్రాన్ని గులాబీ రంగు కవర్‌లో, బ్యాలెట్‌ పత్రాన్ని నీలం రంగు కవర్‌లో అందజేస్తారు. ఓటు వేశాక.. ఆయా పత్రాల్ని అవే కవర్లలో ఉంచి సీల్‌ వేయాలి. కొందరు డిక్లరేషన్‌ పత్రాన్ని నీలం కవర్‌లో, బ్యాలెట్‌ పత్రాన్ని గులాబీ కవర్‌లో ఉంచి సీల్‌ వేస్తున్నారు. మరికొందరు సీల్‌ కూడా వేయడం లేదు. అలాంటి వాటిని లెక్కించరు.

నచ్చిన అభ్యర్థికి సంబంధించి బ్యాలెట్‌ పత్రంలో నిర్దేశించిన గడి (బాక్స్‌)లోనే ‘టిక్‌’ మార్క్‌ గానీ, ‘క్రాస్‌’ మార్క్‌ గానీ వేయాలి. గడి దాటి వెళ్లిన మార్కును ఓటుగా పరిగణించరు. మరికొందరు తమకు నచ్చిన అభ్యర్థి గడిలో ‘టిక్‌’ మార్కు వేసి, నచ్చని అభ్యర్థుల గడుల్లో ‘క్రాస్‌’ గుర్తులు వేస్తున్నారు. ఇలాంటి పోస్టల్‌ ఓట్లను తిరస్కరిస్తారు.

ప్రస్తుత తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో సుమారు 4.50 లక్షల మంది పోలింగ్‌ అధికారులు, సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. గతంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, మిలిటరీ ఉద్యోగులకే పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం ఉండేది. ఈసారి ఎయిర్‌పోర్టు, రైల్వే, ఆల్‌ ఇండియా రేడియో, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో, వైద్యారోగ్య, విద్యుత్తు, రోడ్లు భవనాలు, పౌరసరఫరాలు, అగ్నిమాపక శాఖ, మీడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎఫ్‌సీఐ శాఖల ఉద్యోగులకు కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని ఈసీ కల్పించింది.

Abdul Nayeem
Author: Abdul Nayeem

Sub editor

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here