ఈజి మనీ కోసం….మోసాలు చేసిన వారిని చూసాం..ఎన్నో ఎన్నొన్నో చూసాం…కానీ ఈ స్టోరీ చదివితే.. అర్ధం అయ్యిద్ది…మానవత విలువలు మంట గలిసాయి…అని

  • బీమా సొమ్ము కోసం అమ్మమ్మను పాము కాటుతో హత్య చేసిన మనవడు.
  • పాములు పట్టే వ్యక్తికి రూ.30 వేలు సుఫారి ఇచ్చి దారుణానికి ఒడిగట్టిన మనవడు.
  • సహకరించిన బీమా ఏజెంట్..
  • మృతి కేసు దర్యాప్తులో బయటపడ్డ నిజాలు.
  • ఛత్తీస్‌గఢ్‌లో వెలుగుచూసిన షాకింగ్ ఘటన.

ఛత్తీస్ గడ్.25.02.2024: బీమా సొమ్ము కోసం ఓ వ్యక్తి తన అమ్మమ్మను పక్కా ప్రణాళికతో అంతమొందించాడు. ఎవరికీ అనుమానం రాకుండా కుట్ర పన్ని పాము కాటుతో హత్య చేశాడు. షాకింగ్‌కు గురిచేస్తున్న ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో వెలుగుచూసింది. రాష్ట్రంలోని కాంకేర్‌ జిల్లాలోని బాందే పోలీస్ స్టేషన్ పరిధిలో రాణి పఠారియా అనే మహిళ 8 నెలల క్రితం పాము కాటుతో చనిపోయింది. అయితే రూ.1 కోటి బీమా సొమ్ము కోసం మనవడే ఈ దారుణానికి పాల్పడ్డాడని తాజాగా బయటపడింది. కోటీశ్వరుడు కావాలనే దురాశతో ఈ దారుణానికి ఒడిగట్టాడని తేలింది.

నిందితుడు ఆకాశ్ ఓ పాములు పట్టే వ్యక్తికి రూ.30 వేలు సుఫారీ ఇచ్చి పాము కాటుతో చంపించాడని పోలీసులు గుర్తించారు. మహిళ మరణ ఘటనపై కేసు నమోదు కావడంతో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నిందితుడు ఆకాశ్ ప్రవర్తనపై సందేహం కలిగింది. అదే సమయంలో మహిళ మరణం సాధారణ పాముకాటు మాదిరిగా లేదని పోలీసులు గుర్తించారు. అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా సేకరించారు. దీంతో తమదైన రీతిలో ఇన్వెస్టిగేషన్ చేయడంతో నిందితుడు ఆకాశ్ నేరాన్ని అంగీకరించాడు. బీమా సొమ్ము కోసమే ఈ పన్నాగం పన్నినట్టు వెల్లడించాడు.

కోటీశ్వరుడిని కావాలనే ఆశతో తొలుత బీమా చేయించి పథకం ప్రకారం కొన్నాళ్ల తర్వాత హత్య చేయించినట్టు తెలిపాడు. ఈ హత్యలో నిందితుడితో పాటు బీమా ఏజెంట్ పాత్ర కూడా ఉందని పోలీసులు తేల్చారు. ప్రధాన నిందితుడు ఆకాశ్, బీమా ఏజెంట్‌, పాముల పట్టే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. కాగా అమ్మమ్మ చనిపోయాక నిందితుడు రూ.1 కోటి బీమా సొమ్ము అందుకున్నాడని పోలీసులు వివరించారు. అతడి నుంచి రూ.10 లక్షల నగదు, కొన్ని నగలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వివరించారు.

Rajesh
Author: Rajesh

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here